ఆ అమ్మాయిలు లేకుంటే ఈ పుస్త‌కం లేదు …

ఒక స్నేహితుడి చెల్లెలు బెంగుళూరు జయదేవా ప్రాంతంలోని ఒక ఎమ్‌ఎన్‌సీ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఒక మధ్యాహ్నం తనని లంచ్‌కి బయటికి తీసుకువెళ్లాను. చాలా ముభావంగా, ముక్తసరిగా వుంది. ఒకటికి నాలుగుసార్లు రెట్టించి అడిగితే కారణం చెప్పింది. కారణం కాదు, కారణాలు చెప్పింది. కంపెనీలో ఆ అమ్మాయికి నెలకి 35 వేల రూపాయల జీతమొస్తోంది. అది వదులుకోలేదు. అలాగని అక్కడున్న పరిస్థితుల్లో ఉద్యోగంలో కొనసాగనూలేదు. తనను తన కోణం నుంచి అర్థం చేసుకోవడానికి చాలాసేపు పట్టింది.

చివర్లో ఒక ప్రశ్నడిగాను. ‘ఈ సమస్య నీకొక్కదానిదేనా?’ అని. అవుననే జవాబు వస్తుందనుకున్నాను. కానీ ఆశ్చర్యంగా, ఆఫీసులో మెజారిటీ స్టాఫ్‌ తనలాగే ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. ఎంత ప‌నిఒత్తిడినైనా త‌ట్టుకోగ‌లుగుతాం కానీ, విపరీతమైన రాజకీయాలు, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌, బాసిజమ్‌, ఇంకా చాలా ఇబ్బందులున్నాయని చెప్పింది. తను చెప్పిన ఇంకో కారణం వినగానే నాకు కళ్లలోకి అమాంతం నీళ్లు ఉబికాయి. కొంతమందైతే ఇంటినుంచి తెచ్చుకున్న లంచ్‌ బాక్సులు కూడా తెరవరని, ఆకలి చంపేస్తున్నా, భయంతో పనిచేసుకుంటూపోతారని చెప్పింది.

బెంగుళూరు నుంచి తిరిగొస్తున్నప్పుడు విమానంలో ఒక ఎయిర్‌హోస్టెస్‌ తమ సేవలెలా వున్నాయో తెలపాలని కోరుతూ ఒక సర్వే ఫారాన్ని నాచేతికిచ్చింది. నేను రెగ్యులర్‌గా విమానాల్లో ప్రయాణించేవాడిని కాదని, నా అభిప్రాయాలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని ఆమెకి చెప్పాను. ఆ అమ్మాయి మాత్రం ఇది కంపల్సరీ సర్‌ అంది. ఫారం పూర్తిచేస్తూ ఆమెవైపు చూశాను. తన చేతులు బిర్రబిగుసుకుపోయివున్నాయి. కస్టమర్‌ రివ్యూలు ఉద్యోగుల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థమైంది. పాజిటివ్‌గా ఫారాన్ని పూర్తిచేసి ఆమెకిచ్చాను. ఆమె ఊపిరి పీల్చుకుంటూ నవ్వుముఖంతో వెళ్లిపోయింది. నా ముందుసీట్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్లగానే మళ్లీ ఆమె చేతులు బిగుసుకుపోవడం, మనిషి వర్టికల్‌గా స్టిఫ్‌ అయిపోవడం గమనించాను.

ఈ రెండు అంశాలూ నా మ‌న‌సులో తీవ్ర‌మైన క‌ల‌త‌ను రేపాయి. ఎన్నో కొత్త ఆశ‌ల‌తో, జీవితం మీద గొప్ప న‌మ్మ‌కంతో ఉద్యోగాల్లో చేరి, మంచి భ‌విష్య‌త్తు సంపాదించుకోగ‌ల‌మ‌నే విశ్వాసంతో వున్న యువ‌తీయువ‌కులు ఇలాంటి పోక‌డ‌ల‌ను ఎదుర్కోలేక‌పోతే అది వ్య‌క్తిగ‌తంగా వారికి మాత్ర‌మే కాదు, మొత్తం దేశానికే న‌ష్టం. వ‌ర్క్‌ప్లేస్‌లో ఎదుర‌య్యే ఇలాంటి వంద‌లాది అంశాల‌పై వారికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌నం ఇవ్వ‌గ‌లిగితే దేశానికి నావంతు ఉప‌యోగ‌ప‌డిన‌వాడిన‌వుతాన‌నే ఆలోచ‌న క‌లిగింది. నాకు తెలిసిన విద్య, నా వృత్తి రాయ‌డం, శిక్ష‌ణ ఇవ్వ‌డం మాత్ర‌మే కాబ‌ట్టి నా ప‌నిముట్ల‌నే ఉప‌యోగించుకుంటూ వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి!! పేరుతో తెలుగులో ఒక పుస్త‌కం రూపొందించాను.

ఈ 180 పేజీల పుస్త‌కం రాయ‌డానికి నాకు ఏడు నెల‌ల‌కు పైగా ప‌ట్టింది. ర్యాండ‌మ్‌గా ఎంచుకున్న‌ 300 మందికి పైగా ఉద్యోగుల‌తో ప‌లు విష‌యాల‌పై మాట్లాడాను. 20కి పైగా వ‌ర్క్‌ప్లేస్‌ల‌ను ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించాను. కొంద‌రు మాన‌సిక నిపుణులు, వృత్తినిపుణులతో సంప్ర‌దించాను. చివ‌రికి మాన‌వ‌శాస్త్రం (ఆంత్రోపాల‌జీ) నిపుణులు డాక్ట‌ర్ గునుగుంట్ల కేశ‌వ‌రెడ్డి గారి విలువైన సాయం కూడా తీసుకున్నాను. అనేక స‌వ‌ర‌ణ‌లు, అప్‌డేట్స్ త‌ర్వాత 180 పేజీల‌తో పుస్త‌కం ఫైన‌ల్ అయింది. వర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్ అంశంలో తెలుగులో మొట్ట‌మొద‌టి పుస్త‌కం విడుద‌ల చేసిన సంతృప్తి మిగిలింది.

పుస్త‌కం రాసింది నేనే అయినా, అందుకు ప్రేర‌ణ‌నిచ్చిన చెల్లెలు నిర్మ‌ల‌, ఎయిర్‌హోస్టెస్ సోద‌రి అనీలా క్రిస్టోఫ‌ర్‌ల‌కు ఈ పుస్త‌కం ప్రేమ‌గా అంకిత‌మిస్తున్నాను. ఈ ఇద్ద‌ర‌మ్మాయిలు లేకుండా ఈ పుస్త‌కం లేదు.

Published by

myworkplacebooks

Myself Suresh Veluguri, a Content Writer & Language Services Manager by profession and social analyst by passion. I am producing some content for the benefit of young employees, managers and enterprenuers irrespective of their working domain. Here I am posting all the articles. Thank you.

2 thoughts on “ఆ అమ్మాయిలు లేకుంటే ఈ పుస్త‌కం లేదు …”

  1. Pingback: వేదిక

Leave a comment